పని మానేసినందుకు పనిమనిషిపై ‘తుపాకీ’ ఎక్కుపెట్టిన యజమాని కొడుకు! థానేలో కలకలం

మహారాష్ట్రలోని థానేలో (Thane) ఇంటి పనిమనిషిపై బెదిరింపుల విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాలుగు రోజులు సెలవు తీసుకున్న పనిమనిషి తిరిగి పనికి రాకపోవడంతో, ఇంటి యజమానురాలు, ఆమె కుమారుడు ఆమెను దొంగతనం కేసులో ఇరికిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, యజమానురాలి కుమారుడు పనిమనిషి కుటుంబంపైకి తుపాకీని ఎక్కుపెట్టి బెదిరించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో, బాధితురాలి కుటుంబం కాసర్‌వడ్వలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి యజమానురాలు మోనికా శర్మను, ఆమె కుమారుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, యజమాని కొడుకు చూపించింది నిజమైన తుపాకీ కాదని, అది తుపాకీ ఆకారంలో ఉన్న లైటర్ అని తేలింది. అయినప్పటికీ, ఆయుధం లాంటి వస్తువును చూపి బెదిరించినందుకు గాను తల్లి, కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.