మామగారు ఇచ్చిన బంగారు గాజులు తిరిగిచ్చేసిన భార్య! విడాకుల్లో ‘అరుదైన’ ఉదంతం

పరస్పర అంగీకారంతో ఓ వివాహ బంధం ముగిసిన సందర్భంలో సుప్రీంకోర్టు సదరు మహిళను ప్రశంసించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిని ‘అరుదైన రాజీ’గా అభివర్ణించింది. విడాకుల విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన మహిళ తన భర్తతో విడాకులకు అంగీకరించారు. తాను ఎటువంటి భరణం లేదా ఇతర ఆర్థిక పరిహారం కోరడం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అంతేకాకుండా, ఆ మహిళ తన అత్తగారు బహుమతిగా ఇచ్చిన బంగారు గాజులను కూడా తిరిగి ఇచ్చేశారు. ఆమె చర్యను ప్రశంసించిన సుప్రీంకోర్టు, “ఇటువంటి గొప్ప పని ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది” అని వ్యాఖ్యానించింది. అనంతరం కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేస్తూ, గత కేసులన్నీ రద్దు అవుతాయని ప్రకటించింది. ‘గతాన్ని మర్చిపోయి, సంతోషంగా జీవించండి’ అని కోర్టు ఆ మహిళకు సూచించింది.