కోటి రూపాయల బిజినెస్! టెక్ యువతి రూపొందించిన ల్యాండ్‌లైన్ హ్యాండ్సెట్ సంచలనం

యుఎస్‌కు చెందిన టెక్ ఎంటర్ప్రెన్యూర్ క్యాట్ గోయెట్జ్, స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించుకునేందుకు వినూత్నంగా పాత ల్యాండ్‌లైన్ ఫోన్ తరహా హ్యాండ్‌సెట్‌ను రూపొందించారు. ఆమె పాత పింక్ క్లామ్‌షెల్ హ్యాండ్‌సెట్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేశారు. దీనికి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. దీంతో ఆమె ‘Physical Phones’ అనే ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. కేవలం మూడు రోజుల్లోనే $1,20,000 (దాదాపు ₹1 కోటి) విలువైన హ్యాండ్సెట్లు అమ్ముడై ఆమె అంచనాలను మించిపోయాయి.
ప్రస్తుతం ‘Physical Phones’లో $90 నుండి $110 ధరలలో ఐదు రకాల హ్యాండ్సెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లతో బ్లూటూత్ ద్వారా జతచేసి సాధారణ కాల్స్‌తో పాటు WhatsApp, FaceTime వంటి యాప్ కాల్స్‌ను కూడా రిసీవ్ చేయగలవు. స్క్రీన్ టైమ్‌పై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తే ఈ ఉత్పత్తి విజయానికి ప్రధాన కారణమని గోయెట్జ్ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తిని పెంచడానికి ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకున్నారు, 2025 డిసెంబర్ నుండి మొదటి పెద్ద బ్యాచ్ షిప్పింగ్ ప్రారంభం కానుంది.