10 ఏళ్లలోనే చంద్రుడిపై నగరం! ఎలాన్ మాస్క్ సంచలన ప్రకటన

వచ్చే పదేళ్లలోపు చంద్రుని ఉపరితలంపై మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా స్పేస్ ఎక్స్ (SpaceX) భారీ అడుగులు వేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ తన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంగారక గ్రహం కంటే చంద్రుడికి ప్రయాణించడం సులభమని, ప్రతి 10 రోజులకు ఒకసారి ఇక్కడకు రాకెట్లను పంపవచ్చని ఆయన వివరించారు. ఈ వ్యూహాత్మక మార్పు ద్వారా అతి తక్కువ కాలంలోనే చంద్రుడిపై స్వయం సమృద్ధి గల నగరాన్ని నిర్మించవచ్చని మాస్క్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2027 నాటికి తొలి అడుగులు పడే అవకాశం ఉంది.
చంద్రుడిపై నివాసం సామాన్యులకు అందని ద్రాక్షే అని చెప్పాలి. వివిధ నివేదికల ప్రకారం, ప్రైవేటు వ్యక్తులు చంద్రుడికి వెళ్లాలంటే ఒక్కో సీటుకు సుమారు 100 మిలియన్ల నుండి 750 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాసాతో కలిసి పనిచేస్తున్న స్పేస్ ఎక్స్, అమెరికా ప్రభుత్వ సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. అంగారక గ్రహ యాత్రను పూర్తిగా విస్మరించకపోయినప్పటికీ, ప్రస్తుతానికి చంద్రుడిపైనే దృష్టి సారించినట్లు సంస్థ స్పష్టం చేసింది. మానవ నాగరికతను గ్రహాంతరాలకు విస్తరించడంలో ఈ ‘మూన్ సిటీ’ కీలక పాత్ర పోషించనుంది.