రణబీర్ తర్వాత ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ

బాలీవుడ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రణబీర్ సింగ్ తర్వాత ఇప్పుడు నేరుగా సల్మాన్ ఖాన్ సోదరి భర్త, నటుడు ఆయుష్ శర్మకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా బెదిరింపులు పంపింది. బుధవారం ప్రోటాన్ మెయిల్ ద్వారా అర్పితా ఖాన్ భర్తకు ప్రాణహాని ఉందని సందేశం అందింది, అందులో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు స్పష్టంగా ఉంది. ఈ ఘటనతో ఆయుష్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. అంతకుముందు ఫిబ్రవరి 10న రణబీర్ సింగ్‌కు కూడా వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చాయి. వరుసగా సినీ ప్రముఖులకు ఇలాంటి హెచ్చరికలు రావడం బీ-టౌన్‌లో పెను కలకలం రేపుతోంది.
ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వెలుపల కూడా కాల్పులు జరగ్గా, దానికి లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాధ్యత వహించింది. రణబీర్, ఆయుష్ విషయాల్లో టెక్నాలజీని ఉపయోగించి పంపిన వారి వివరాలను దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌తో బిష్ణోయ్ వర్గానికి ఉన్న పాత పగ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు రణబీర్, ఆయుష్ ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు దర్యాప్తును వేగవంతం చేశారు.