యూట్యూబ్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి భారత్ సహా పలు దేశాల్లో మిలియన్ల మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు వెబ్‌సైట్, ఇటు మొబైల్ యాప్ కూడా పనిచేయకపోవడంతో యూజర్లు బెంబేలెత్తిపోతున్నారు.
అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్ ‘డౌన్‌డెటెక్టర్’ నివేదిక ప్రకారం.. అమెరికాలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సమస్య వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒక్క అమెరికాలోనే దాదాపు 3,20,000 మందికి పైగా ఫిర్యాదులు చేయగా, భారత్‌లో కూడా ఈ ఉదయం సమయానికి 18,000 మందికి పైగా వినియోగదారులు తమకు సేవలు అందడం లేదని నివేదించారు.
ముఖ్యంగా వీడియోలు ప్లే కాకపోవడం, సెర్చ్ రిజల్ట్స్ రాకపోవడం వంటి సమస్యలను భారతీయ యూజర్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సాంకేతిక లోపానికి గల కారణమేంటి? మళ్లీ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారు? అనే విషయాలపై గూగుల్ లేదా యూట్యూబ్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెరికాలోని సర్వర్లలో తలెత్తిన సమస్యే ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరాయానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.