మ్యాట్రిమోనీలో 715 కోట్ల ఆస్తి ఉందని నమ్మించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కోట్లలో కుచ్చుటోపి
January 20, 2026

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవ్య శ్రీ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన విజయ్ రాజ్ గౌడ చేతిలో 1.53 కోట్ల రూపాయలు మోసపోయారు. నిందితుడు తనను తాను 715 కోట్ల ఆస్తులున్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని, నకిలీ పత్రాలతో నవ్య కుటుంబాన్ని నమ్మించాడు. వ్యాపారంలో పెట్టుబడి పేరుతో వారి రిటైర్మెంట్ డబ్బును, నగలను కాజేశాడు.
అయితే అసలు విషయం ఏమిటంటే, నిందితుడికి ఇదివరకే పెళ్లయిందని, తన సోదరిగా పరిచయం చేసిన వ్యక్తి నిజానికి అతని భార్య అని బాధితురాలు గుర్తించింది. ఈ మోసంలో నిందితుడి తండ్రి కూడా భాగస్వామిగా ఉన్నట్లు తేలింది. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు నవ్యను చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు, అతని భార్య మరియు తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.