మ్యాచ్‌కు ముందు గిన్నెలు కడిగాం.. పాకిస్థాన్ హాకీ కెప్టెన్ సంచలన ఆరోపణలు

పాకిస్థాన్ హాకీ జట్టులో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన తమకు కనీస వసతులు కూడా కల్పించలేదని, మ్యాచ్‌లు ఆడబోయే ముందు తామే గిన్నెలు కడుక్కోవాల్సి వచ్చిందని ఆ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ సంచలన విషయాలను బయటపెట్టారు.
ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తమకు కేవలం 10 రోజులు మాత్రమే వసతి కల్పించారని, మిగిలిన రోజుల్లో అత్యంత చౌకైన ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కిచెన్ శుభ్రం చేయడం, అంట్లు తోమడం వంటి పనులు ముగించుకుని మైదానంలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాలను బయట చెబితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు బెదిరించినట్లు కూడా షకీల్ వెల్లడించారు.
లాహోర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జట్టుకు విదేశీ కోచ్ అవసరమని, ప్రస్తుత యాజమాన్య తీరుతో ముందుకు సాగడం కష్టమని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా, జర్మనీ చేతుల్లో ఓటమి పాలైంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్, క్రీడాకారులకు కనీస గౌరవం కూడా ఇవ్వలేకపోతోందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.