మేఘాలయ వెళ్లే పర్యాటకులకు షాక్, ఇకపై ఆదివారం ఆ గ్రామంలోకి నో ఎంట్రీ

న్యూస్ డెస్క్ : మీరు మేఘాలయలోని అందమైన మావ్లినోంగ్ గ్రామాన్ని చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త నియమం గురించి తప్పక తెలుసుకోవాలి. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరున్న మావ్లినోంగ్‌లోకి ఇకపై ప్రతి ఆదివారం పర్యాటకులకు ప్రవేశం ఉండదు. ఈ నిర్ణయం వల్ల సమాచారం తెలియకుండా వెళ్లే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆదివారం నాడు అక్కడ హోటళ్లు, దుకాణాలు, కనీసం మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉండవు.
స్థానిక ప్రజలు ఆదివారం చర్చి ప్రార్థనలలో పాల్గొంటారు కాబట్టి, పర్యాటకులకు సేవలు అందించడం వీలుపడదని గ్రామ కౌన్సిల్ తెలిపింది. అయితే ముందుగానే బుకింగ్ చేసుకున్న పర్యాటకులకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది. సాధారణ పర్యాటకులు తమ పర్యటనను సోమవారం నుండి శనివారం మధ్య మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే దూర ప్రాంతాల నుండి వచ్చి గ్రామంలోకి అనుమతి లభించక నిరాశతో వెనుతిరగాల్సి వస్తుంది.