భారత్‌లోకి చొరబడిన పాకిస్థానీ యువకుడు! గోశాలలో దాక్కున్న వ్యక్తిని పట్టుకున్న బీఎస్‌ఎఫ్

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి చొరబడిన ఒక పాకిస్థానీ యువకుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అరెస్టు చేసింది. రాత్రి వేళ కంచె దాటి భారత భూభాగంలోకి సుమారు 200 మీటర్లు చొరబడ్డాడు. పాకిస్థాన్‌లోని మితి ప్రాంతానికి చెందిన నయాట్ పల్లెవాసి అయిన 24 ఏళ్ల హిడాల్ అనే ఆ యువకుడు ఉదయం ఓ గ్రామంలోని గోశాలలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.
అతడిని గుర్తించిన గ్రామస్తులు వెంటనే బీఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. దీంతో బీఎస్‌ఎఫ్ దళాలు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపాయి. అతని నుంచి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకోలేదు. అయినప్పటికీ, ఎందుకు సరిహద్దు దాటి వచ్చాడు, ఏ మార్గం ద్వారా చొరబడ్డాడు అనే విషయాలను తెలుసుకోవడానికి భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. తదుపరి విచారణ నిమిత్తం అతడిని సెడ్వా పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.