భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే జైలు శిక్షే

భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే జైలు శిక్షే

తాలిబన్ల కొత్త చట్టంతో మహిళలు ఇక వంటింటికే పరిమితం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన మరోసారి పరాకాష్టకు చేరింది. మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించివేస్తూ తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుండ్‌జాదా 90 పేజీల కొత్త క్రిమినల్ కోడ్‌ను అమలులోకి తెచ్చారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం మహిళలు తమ భర్త అనుమతి లేకుండా కనీసం పుట్టింటికి లేదా బంధువుల ఇంటికి వెళ్లడం కూడా నేరమే. ఒకవేళ భర్త మాట కాదని వెళ్తే వారికి ఏకంగా మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.

బానిసలుగా మారుతున్న మహిళలు

ఈ కొత్త చట్టం మహిళలను కేవలం పురుషుల ఆధీనంలో ఉండే బానిసలుగా మార్చేసిందని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. భార్యను భర్త లేదా తండ్రి యథేచ్ఛగా శిక్షించవచ్చని ఈ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఒకవేళ భర్త దాడి చేస్తే ఆ గాయాలను న్యాయమూర్తులకు చూపిస్తేనే అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన నిబంధన ఉంది. బాధితురాలు కోర్టుకు రావాలన్నా తన శరీరాన్ని పూర్తిగా కప్పుకుని భర్త లేదా మగ తోడుతోనే రావాల్సి ఉంటుంది. అంటే తనపై దాడి చేసిన భర్త సాయంతోనే ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది.

వివక్షతో కూడిన శిక్షలు

తాలిబన్ల ఈ కొత్త కోడ్ సమాజంలోని హోదాల ఆధారంగా శిక్షలను ఖరారు చేస్తోంది. మత నాయకులు మరియు ముల్లాలు ఎలాంటి నేరాలు చేసినా వారికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ల నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. భర్త పిలిచినప్పుడు భార్య వెళ్లకున్నా లేదా ఆమెను వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నా వారిని కూడా నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తారు. ఈ నిబంధనల వల్ల గృహ హింస విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *