బాఫ్టా వేదికపై అలియా భట్ అరుదైన రికార్డు.. హాలీవుడ్ దిగ్గజాల సరసన భారతీయ నటి సందడి

బాఫ్టా వేదికపై అలియా భట్ అరుదైన రికార్డు.. హాలీవుడ్ దిగ్గజాల సరసన భారతీయ నటి సందడి

బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) 2026 వేడుకల్లో భారతీయ సినిమా కీర్తి పతాక మరోసారి ప్రపంచ వేదికపై రెపరెపలాడనుంది. మన దేశం గర్వించదగ్గ నటీమణులలో ఒకరైన అలియా భట్ ఈ ప్రతిష్టాత్మక 79వ ఎడిషన్ బాఫ్టా అవార్డుల ప్రెజెంటర్‌గా ఎంపికై అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రపంచ దిగ్గజాల సరసన అలియా

లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఫిబ్రవరి 22న జరగనున్న ఈ వేడుకలో ఆస్కార్ విజేత సిలియన్ మర్ఫీ, కేట్ హడ్సన్, బ్రయాన్ క్రాన్స్టన్ వంటి హాలీవుడ్ స్టార్లతో కలిసి అలియా అవార్డులను అందజేయనున్నారు. ఈ విషయాన్ని బాఫ్టా అధికారికంగా ప్రకటించగా.. అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో “నన్ను గుర్తుపట్టగలిగితే మీకు 100 మార్కులు” అంటూ సరదాగా పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

ముగ్గురు ముద్దుగుమ్మల జాబితాలో..

గతంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (2021), దీపికా పదుకొణె (2024) మాత్రమే ఈ వేదికపై ప్రెజెంటర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆలియా భట్ ఆ జాబితాలో చేరిన మూడవ భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు. కేవలం నటనలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా సత్తాను చాటుతూ అలియా మరో మైలురాయిని చేరుకున్నారు.

మణిపురి సినిమాకు చోటు

ఈసారి బాఫ్టా అవార్డుల్లో భారత్ నుంచి మరో విశేషం కూడా ఉంది. మణిపురి చిత్రం ‘బూంగ్’ (Boong) నామినేషన్లలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలియా భట్ లాంటి స్టార్ ప్రెజెంటర్‌గా ఉండటం, భారతీయ సినిమా నామినేషన్లలో ఉండటంతో ఈసారి బాఫ్టా వేడుకలు భారతీయులకు మరింత ప్రత్యేకం కానున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *