ఫోన్ కవర్ కొంటే ఐఫోన్ ఫ్రీ.. ఈ ఆఫర్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం జేడీ.కామ్ (JD.com) తన కస్టమర్ల కోసం ఒక కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ కవర్ కొనుగోలు చేస్తే చాలు, ఏకంగా ఖరీదైన ఐఫోన్‌ను ఉచితంగా పొందవచ్చని వెల్లడించింది. వినడానికి ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఈ ఆఫర్ వెనుక ఉన్న అసలు షరతులు తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
సాధారణంగా మనం వందల రూపాయల్లో ఫోన్ కవర్లు కొంటుంటాం. కానీ ఇక్కడ జేడీ.కామ్ విక్రయిస్తున్నది మామూలు ప్లాస్టిక్ లేదా లెదర్ కవర్ కాదు. ఇది ఏకంగా 99.99 శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన అత్యంత ఖరీదైన కవర్. సుమారు 100 గ్రాముల బరువున్న ఈ బంగారు కవర్‌ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఐఫోన్‌ను ఉచితంగా అందజేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ 100 గ్రాముల బంగారు కవర్ విలువ సుమారు 16.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంత భారీ మొత్తం వెచ్చిస్తే భారతదేశంలో ఒక లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారునే కొనుగోలు చేయవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, వినియోగదారులు కారు ధర అంత వెచ్చించి బంగారు కవర్ కొంటేనే ఆ ఐఫోన్ ఉచితంగా లభిస్తుంది.
అయితే ఇంత భారీ మొత్తాన్ని భరించలేని వారి కోసం కంపెనీ మరో వెసులుబాటు కూడా కల్పించింది. 100 గ్రాముల కవర్ కాకుండా 10 గ్రాములు మరియు 30 గ్రాముల బరువున్న బంగారు కవర్లను కూడా అందుబాటులో ఉంచింది. వీటిపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లేదా ఇతర ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ‘గోల్డెన్ ఆఫర్’ హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఐఫోన్ కోసం ఇంత భారీ మొత్తంలో బంగారం కొనడం అవసరమా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే, పెట్టుబడితో పాటు ఫోన్ కూడా వస్తుంది కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.