ప్రభుత్వానికి ఇచ్చిన దీవెనలు వెనక్కి తీసుకుంటామని శంకరాచార్య హెచ్చరిక
December 17, 2025

కాశీలోని మఠాలు, ఆలయాలకు మున్సిపల్ నోటీసులు పంపడంపై జ్యోతిష్పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధువుల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వారు, ఇప్పుడు వారికే నోటీసులు ఇవ్వడం ‘భస్మాసుర’ వైఖరిని గుర్తు చేస్తోందని ఆయన మండిపడ్డారు. తప్పుడు వ్యక్తులకు ఆశీస్సులు ఇస్తే ఇలాగే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నట్లే, సాధువులు కూడా తమ ఆశీస్సులను వెనక్కి తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై చర్చించేందుకు మార్చిలో ఢిల్లీలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం వల్ల సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని శంకరాచార్య స్పష్టం చేశారు.