పావురాలకు ఆహారం పెట్టి రూ. 2 లక్షల జరిమానా కట్టిన వృద్ధురాలు, నగరాల్లో పెరుగుతున్న ప్రాణాంతక వ్యాధుల ముప్పు

సింగపూర్‌లో కిటికీ వద్ద పావురాలకు ఆహారం పెట్టినందుకు 71 ఏళ్ల వృద్ధురాలికి అక్కడి కోర్టు 3,200 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది, దీని భారతీయ విలువ సుమారు 2 లక్షల రూపాయల పైమాటే. ఇది వింతగా అనిపించినప్పటికీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ మరియు ఇటలీ వంటి దేశాలు అడవి పక్షులకు ఆహారం ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలలో పావురాల సంఖ్య పెరగడం వల్ల వాటి విసర్జితాల నుండి వెలువడే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా గాలి ద్వారా మనుషుల శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తున్నాయి.
వైద్య శాస్త్రం ప్రకారం పావురాల రెట్టల ద్వారా ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్’ లేదా ‘బైర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయి. హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తాయి. పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు జ్వరం వంటి లక్షణాలతో మొదలయ్యే ఈ వ్యాధులు ముదిరితే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది. వినోదం కోసం పావురాలకు ఆహారం వేయడం వల్ల అవి నివాస ప్రాంతాలకు అలవాటు పడి ప్రాణాంతక వ్యాధులను మోసుకొస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.