నా కూతురు బట్టలు, నోరు అంతా రక్తసిక్తంగా ఉన్నాయి… 4వ తరగతి విద్యార్థినికి జరిగిన దారుణం… తల్లి కన్నీటితో కూడిన ఇంటర్వ్యూ!

తిరువళ్ళూరు: పాఠశాల ముగించుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న నాలుగో తరగతి బాలికపై కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడాన్ని బాలిక తల్లి కన్నీటితో విమర్శించింది.
ఈ ఘటన జూలై 12న గుమ్మిడిపూండి సమీపంలోని ఆదంబాక్కం వద్ద చోటుచేసుకుంది. బాధిత బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతోంది. దినచర్యలో భాగంగా రైలులో ప్రయాణించి స్కూల్‌కి వెళ్లి వస్తుంటుంది.
పాఠశాల ముగిశాక, అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అనుపరిచితుడు ఆమెను వెంబడించి, కత్తితో బెదిరించి, ఓ పక్కకు లాక్కెళ్లి దాడికి పాల్పడ్డాడు. బాలిక ధైర్యంగా తప్పించుకుని ఇంటికి పరుగెత్తి వచ్చింది.
“నన్ను వదిలేయండి అంకుల్… నన్ను బాధపెట్టకండి…” బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం:
“ఆ వ్యక్తి నా బిడ్డను బలవంతంగా లాక్కెళ్లి కొట్టాడు. ఆమె ఏడుస్తూ ‘నన్ను వదిలేయండి అంకుల్… నన్ను కొట్టకండి… నన్ను బాధపెట్టకండి…’ అని వేడుకుంది. అయినా అతను ఆగలేదు. ఆమెను నేలకూలబెట్టి, దారుణంగా వేధించాడు.”
“ఆ సమయంలో అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అవకాశాన్ని ఆసరాగా తీసుకొని నా కూతురు అక్కడి నుంచి పారిపోయింది. కానీ అతను ఆమెను కాలు పట్టుకుని లాగాడు. కత్తితో బెదిరించి, ‘నువ్వు ఎవరికైనా చెప్పినా, నీ గొంతు కోసి దగ్గరలోని గుంటలో పడేస్తాను’ అని భయపెట్టాడు.”
ముఖం, బట్టలు రక్తసిక్తం తల్లి తెలిపినట్లు, బాలిక మౌనంగా ఇంటికి వచ్చేసింది. ఆమె ముఖం, దుస్తులు రక్తంతో కప్పుకుపోయిన పరిస్థితిలో ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు.
“ఆమె చెప్పులు వేసుకోకుండా పరుగు తీసి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ‘ఒక హిందీ అబ్బాయి బ్యాడ్ టచ్ చేశాడు’ అని చెప్పింది. అప్పుడు మేము వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం,” అని తల్లి చెప్పింది.
పోలీసుల స్పందన – కానీ ఇంకా అరెస్టు లేదు ఫిర్యాదు మేరకు గుమ్మిడిపూండి డీఎస్పీ స్వయంగా బాలికను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. కానీ ఒక వారం గడుస్తున్నా నిందితుడు ఇంకా పట్టుబడలేదు.
“నా బిడ్డ శరీరంపై గాయాలు ఇంకా మానలేదు. ఆమె మనసులో మాత్రం మరింత గాయమైంది. అతన్ని తక్షణం అరెస్టు చేయాలని మేము కోరుతున్నాం,” అని తల్లి కన్నీటితో మీడియాకుచెప్పింది.