తులం బంగారంపై భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజుల్లోనే వేలల్లో పతనం

హైదరాబాద్ పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు అదిరిపోయే శుభవార్త అందింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వేలల్లో ధరలు పతనం కావడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. నిన్న రూ. 1200 తగ్గగా, నేడు ఏకంగా రూ. 2 వేలకు పైగా పతనం కావడం విశేషం.
ప్రస్తుత ధరల వివరాలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) పై రూ. 2050 మేర తగ్గి, ప్రస్తుతం రూ. 1,41,350 వద్ద కొనసాగుతోంది. ఇక అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 2240 మేర క్షీణించి, ప్రస్తుతం రూ. 1,54,200 కు చేరింది.
బంగారం దారిలోనే వెండి కూడా గతంలో భారీగా తగ్గినప్పటికీ, నేడు మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి నెలలో రూ. 4.25 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన వెండి, అక్కడి నుంచి ఏకంగా రూ. 1.60 లక్షల మేర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. గత 8 రోజులుగా వెండి ధర పెరగకపోవడం వెండి ప్రియులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజే 100 డాలర్ల మేర తగ్గడం దీనికి ప్రధాన కారణం. అమెరికా డాలర్ విలువ పుంజుకోవడంతో పాటు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు మారడంతో ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి.
కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ, ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరమనే చెప్పాలి. కొత్తగా నగలు చేయించుకోవాలనుకునే వారికి లేదా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.