తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి 13 ఏళ్ల కూతురిని ముసలాడికి అమ్మేసిన తల్లి

న్యూస్ డెస్క్ : కన్నతల్లే కాలయమురాలిగా మారి తన 13 ఏళ్ల కుమార్తెను 55 ఏళ్ల వయసున్న వ్యక్తికి కట్టబెట్టిన దారుణ సంఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉందని, భర్త చనిపోయాడని కూతురిని నమ్మించి ఆమె జీవితాన్ని నరకప్రాయం చేసింది. అనంతరం ఆ తల్లి తన ప్రియుడితో పరారైంది. ఈ ఘటన సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, కన్నవారే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
గుజరాత్ నుంచి తండ్రి తిరిగి రావడంతో ఈ దారుణమైన కుట్ర బయటపడింది. ఆయన తన కూతురిని వెతికి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ చిన్నారికి విముక్తి లభించింది. పోలీసులు నిందితుడైన వృద్ధుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం ఆ బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంది. చిన్నపిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాల వంటి సామాజిక రుగ్మతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.