టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సంచలన నిర్ణయం.. ఆ స్టార్ ఆటగాడిపై వేటు పడటం ఖాయమేనా

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా, ఇప్పుడు నెదర్లాండ్స్‌తో తన చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం రాత్రి జరగనున్న ఈ పోరులో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సూపర్-8 బెర్తును ఖరారు చేసుకున్న రోహిత్ సేన, ఈ మ్యాచ్‌లో కొన్ని కీలక మార్పులతో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ, ఫీల్డింగ్‌లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ‘చైనామన్’ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అతని ‘లేజీ’ ఫీల్డింగ్ పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేయడంతో, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయిన యువ సంచలనం అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. సూపర్-8 సమరానికి ముందు అతను గాడిలో పడటం జట్టుకు అత్యంత కీలకం. ఒకవేళ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తే, మహమ్మద్ సిరాజ్ తుది జట్టులో చేరతాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ స్పిన్ బాధ్యతలు మోయనుండగా, వాషింగ్టన్ సుందర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
నెదర్లాండ్స్‌తో తలపడే భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తీ.