జర్మనీలో 9 ఏళ్లు ఉన్నా భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోని యువ పారిశ్రామికవేత్త

విదేశీ పౌరసత్వం కోసం చాలా మంది తహతహలాడుతుంటే, జర్మనీలో ఉంటున్న మయూఖ్ పాంజా అనే భారతీయుడు మాత్రం తన దేశంపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. గత 9 ఏళ్లుగా జర్మనీలో ఉంటూ ఏఐ కంపెనీని స్థాపించిన ఆయన, అక్కడి పౌరసత్వానికి అర్హత ఉన్నా దాన్ని తిరస్కరించారు. తాను జర్మనీని గౌరవిస్తానని, కానీ మానసికంగా ఎప్పటికీ భారతీయుడిగానే భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక పత్రం కోసం తన భారతీయ మూలాలను వదులుకోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు.
భారతీయ పాస్‌పోర్ట్ అనేది మన పూర్వీకుల త్యాగాలకు చిహ్నమని మయూఖ్ అభిప్రాయపడ్డారు. జర్మనీ పౌరసత్వం తీసుకుంటే అక్కడి విలువల ప్రకారం జీవించాల్సి ఉంటుందని, కానీ తాను తన భారతీయ అస్థిత్వాన్ని మార్చుకోలేనని ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. భారత్‌లో కొన్ని అంశాలతో విభేదించినప్పటికీ, ఒక భారతీయుడిగా గొంతు ఎత్తే హక్కు తన దేశం తనకు ఇచ్చిందని, ఆ హక్కు తనకు ఎంతో విలువైనదని మయూఖ్ గర్వంగా చెబుతున్నారు.