గౌతమ్ గంభీర్ కోచింగ్ పదవీకాలంపై బీసీసీఐ సంచలన నిర్ణయం

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక భారీ స్కెచ్ వేసింది. ప్రస్తుతం గంభీర్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ, అతని పదవీకాలాన్ని మరింత కాలం పొడిగించే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గంభీర్ పర్యవేక్షణలో జట్టు ప్రదర్శన ఆశాజనకంగా ఉంటే, ఏకంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వరకు ఆయన్నే కోచ్‌గా కొనసాగించాలని బోర్డు భావిస్తోంది.
గంభీర్ ముందున్న అసలైన సవాళ్లు ఇవే
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ దృష్టంతా 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఇప్పటికే భారత్ సూపర్ 8 దశకు చేరుకోవడంతో, ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో గౌతీ ఉన్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ మరియు 2027 వన్డే వరల్డ్ కప్.. ఈ రెండు ఐసీసీ మెగా టోర్నీల ఫలితాలే గంభీర్ భవిష్యత్తును శాసించనున్నాయి. ఈ రెండు టోర్నీల్లో భారత్ విజేతగా నిలిస్తే, గంభీర్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ అధికారిక ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
2028 ఒలింపిక్సే లక్ష్యంగా సరికొత్త వ్యూహం
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ పతకం సాధించడం భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా గంభీర్ వంటి దూకుడున్న కోచ్ సేవలను అప్పటివరకు ఉపయోగించుకోవాలని బీసీసీఐ యోచిస్తోంది. గంభీర్ నేతృత్వంలో యువ ఆటగాళ్లు రాటుదేలుతుండటం, జట్టులో క్రమశిక్షణ పెరగడం బోర్డుకు సానుకూల అంశాలుగా మారాయి. మొత్తానికి గంభీర్ ప్రయాణం కేవలం 2027తో ముగిసిపోదని, ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ఆయన మరికొన్నాళ్లు టీమిండియా వెన్నంటే ఉంటారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.