కిడ్నీలో రాళ్ల నొప్పి అని ఆస్పత్రికి వెళ్తే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ భర్త ఆందోళన
February 4, 2026

ఉత్తరప్రదేశ్‌లోని ఏటాలో ఒక వింత సంఘటన వెలుగుచూసింది. ఆదివారం రాత్రి కిడ్నీలో రాళ్ల నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ మెడికల్ కాలేజీలో చేరింది. వైద్యులు ఆమెను గర్భవతి అని అనుమానించి అడిగినప్పటికీ ఆమె నిరాకరించింది. అయితే చికిత్సలో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె మరుగుదొడ్డిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు విస్మయానికి గురయ్యారు.
మరోవైపు ఈ ఘటనపై ఆమె భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో హంగామా చేశాడు. తాను గత ఏడాది కాలంగా ఇంటికి దూరంగా ఉండి పని చేస్తున్నానని మరి తన భార్యకు బిడ్డ ఎలా పుట్టిందని అతను ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువు పరిస్థితి విషమించడంతో ఆగ్రాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.