ఐటీఆర్ సవరణ గడువు ముగిసింది మీ రీఫండ్ డబ్బులు తిరిగి వస్తాయా లేదా

అసెస్మెంట్ ఇయర్ 2025-26కు సంబంధించి సవరించిన లేదా ఆలస్యపు ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31తో ముగిసింది. నిర్ణీత సమయంలోగా అసలు రిటర్నులను దాఖలు చేసిన వారు, సవరణ గడువును కోల్పోయినా వారి రీఫండ్ నిలిచిపోదు. ఆదాయపు పన్ను శాఖ మీ వివరాలను ధృవీకరించిన తర్వాత సదరు మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రిటర్నులు దాఖలు చేయని వారికి మాత్రం రీఫండ్ పొందడం చాలా కష్టతరమవుతుంది.
గడువు ముగిసిన తర్వాత ‘అప్‌డేటెడ్ రిటర్న్’ (ITR-U) ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ దీని ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేయడం సాధ్యపడదు. ఇది కేవలం అదనపు ఆదాయాన్ని వెల్లడించడానికి లేదా తప్పులను సరిదిద్దుకుని పన్ను చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రిటర్నులు దాఖలు చేసే అన్ని అవకాశాలను కోల్పోయిన వారు రీఫండ్ పొందే హక్కును కూడా కోల్పోతారు. సాధారణంగా బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయిన కొన్ని వారాల నుండి నెలల వ్యవధిలో రీఫండ్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.