ఉక్రెయిన్‌కు లాంగ్-రేంజ్ ఆయుధాలు? అమెరికా చర్యపై రష్యా తీవ్ర హెచ్చరిక

ఉక్రెయిన్‌కు క్రూయిజ్ క్షిపణులు లేదా ఇతర సుదూర ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తే, అది యుద్ధాన్ని తీవ్రంగా పెంచుతుందని రష్యా గట్టిగా హెచ్చరించింది. రష్యా భూభాగంలో దాడుల కోసం కైవ్‌కు సుదూర ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించే చర్చలు ఇటీవల వైట్‌హౌస్‌లో జరుగుతున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ఈ బలమైన సందేశాన్ని ఇచ్చింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మాట్లాడుతూ, మాస్కో ఈ చర్యను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పరిగణిస్తుందని మరియు తగిన, కఠినమైన సమాధానం ఇవ్వడానికి రష్యా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
అమెరికా తీసుకునే ఈ నిర్ణయం ఉద్రిక్తతను కొత్త, ప్రమాదకర స్థాయికి తీసుకువెళ్తుందని పెస్కోవ్ ఉద్ఘాటించారు. కైవ్‌కు ఎలాంటి ‘మేజిక్ బుల్లెట్’ ఆయుధం లేదని, ఆధునిక ఆయుధాలు యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చలేవని ఆయన పేర్కొన్నారు. రష్యా సరిహద్దుల్లో సుదూర దాడులకు అనుమతిస్తే, రష్యా తప్పక ప్రతిస్పందించాల్సి ఉంటుందని పెస్కోవ్ హెచ్చరించారు. మాస్కో తన సైనిక లక్ష్యాలను మార్చుకోకుండా, వాటిని సాధించడంలో స్థిరంగా ఉంటుందని క్రెమ్లిన్ తేల్చి చెప్పింది.