ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నివాసానికి బాంబు బెదిరింపుతో భారీ భద్రతా అలెర్ట్

కాన్బెర్రాలోని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారిక నివాసం ‘ది లాడ్జ్’ కు మంగళవారం రాత్రి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ప్రజలకు లేదా సమాజ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ స్పష్టం చేసింది. అయితే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో రాజకీయ నాయకులు మరియు వివిధ వర్గాల లక్ష్యంగా బెదిరింపులు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వస్తున్న ఇటువంటి బెదిరింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక భద్రతా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచింది.