ఆరావళి పర్వతాలు: మోడీ ప్రభుత్వ నిర్ణయంపై సోనియా గాంధీ ఆగ్రహం ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారతదేశంలోని పురాతన ఆరావళి పర్వత శ్రేణి ప్రమాదంలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫారసుల మేరకు, ఇప్పుడు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న కొండలపై ఖనిజ తవ్వకాలు, మైనింగ్ పనులకు అనుమతి లభించింది. వాయువ్య భారతదేశ వాతావరణాన్ని నియంత్రించే ఈ పర్వత శ్రేణిని రక్షించడానికి పర్యావరణవేత్తలు ‘ఆరావళి గ్రీన్ వాల్’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, ఈ ప్రభుత్వ చర్యను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరావళికి ‘మరణశాసనం’గా అభివర్ణించారు.
మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా దేశంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇది మైనింగ్ మాఫియాకు బహిరంగ ఆహ్వానమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోపించారు. 1980 నాటి అటవీ (సంరక్షణ) చట్టం, 2022 నాటి అటవీ సంరక్షణ నియమాలలో చేసిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరావళి పర్వత శ్రేణిలోని 90 శాతం కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నందున, ఈ నిర్ణయం పర్యావరణానికి భారీ నష్టాన్ని కలిగిస్తుందని, ఈ ప్రాంత భౌగోళికతకు తీవ్రమైన ముప్పును సృష్టిస్తుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.