అభిషేక్ శర్మ బ్యాట్ కు ఏమైంది.. 7 మ్యాచ్‌ల్లో 5 సార్లు డకౌట్ కావడమేంటి

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ కావడంతో అభిషేక్ పేరిట కొన్ని చేదు రికార్డులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన అభిషేక్, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరిగి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు.
హ్యాట్రిక్ డకౌట్ల అప్రతిష్ట
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన అభిషేక్, అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. తిరిగి పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 4 బంతులు ఆడి సున్నాకే అవుటయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ కావడంతో, టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన రెండో భారత ఆటగాడిగా అశీష్ నెహ్రా సరసన చేరాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆండ్రీ ఫ్లెచర్ (వెస్టిండీస్), రోజర్ ముకాస (ఉగాండా) కూడా ఈ జాబితాలో ఉన్నారు.
గణాంకాలు చెబుతున్న భీభత్సం
అభిషేక్ శర్మ గత 7 ఇన్నింగ్స్‌ల స్కోర్లు చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక మానదు.
- గత 7 ఇన్నింగ్స్‌లు: 0, 68*, 0, 30, 0, 0, 0.అంటే గత ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు సార్లు డకౌట్ అయ్యాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ మినహాయిస్తే, మిగతా మ్యాచ్‌ల్లో కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్‌గా కూడా అభిషేక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
సోషల్ మీడియాలో ట్రోల్స్.. సంజూ కోసం డిమాండ్
అభిషేక్ శర్మ వైఫల్యంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కేవలం గుడ్డిగా బ్యాట్ ఊపడమే తప్ప, క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన సూపర్-8 దశకు ముందు ఓపెనర్ ఇలా వరుసగా విఫలం కావడం జట్టుకు ప్రమాదకరమని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఈ యువ సంచలనం, సూపర్-8లోనైనా పుంజుకుని తన సత్తా చాటుతాడో లేదో వేచి చూడాలి.