అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు! వరుసగా మూడోసారి డకౌట్.. ఫ్యాన్స్ ఫుల్ ఫైర్!

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేస్తాడని ఆశించిన ఫ్యాన్స్‌కు వరుస డకౌట్లు షాక్ ఇస్తున్నాయి. కనీసం పసికూనలపై కూడా పరుగులు సాధించలేక ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తడబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు బంతులు ఎదుర్కొన్న అభిషేక్, ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇది ఈ టోర్నీలో అతనికి వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం. గతంలో యూఎస్ఏ, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ ఇలాగే సున్నాకే వెనుదిరిగాడు.
సిరాజ్ జెర్సీతో బ్యాటింగ్.. మిస్టరీ ఏంటి?
ఈ మ్యాచ్‌లో ఒక వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిషేక్ శర్మ తన సొంత జెర్సీకి బదులుగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ జెర్సీని ధరించి బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది పొరపాటున జరిగిందా లేక సెంటిమెంట్ కోసం ఏదైనా ట్రిక్ ప్లే చేశాడా అన్నది అర్థం కాక నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జెర్సీ మార్చినా అదృష్టం మాత్రం మారలేదని, కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మ్యాచ్‌ల్లో విఫలమైనా ఈ మ్యాచ్‌తోనైనా ఫామ్‌లోకి వస్తాడనుకుంటే, మళ్ళీ నిరాశే మిగిల్చాడు.