అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ రాజధాని నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులకు ముఖ్యమంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదని, పరిశుభ్రత విషయంలో అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

అధికారులు ఇక తెల్లవారుజామునే రోడ్లపైకి

మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ విధించారు. ముగ్గురు కమిషనర్లు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తానే స్వయంగా ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలకు వస్తానని, అప్పుడు ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల సమీక్షలో ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చారు.

ఆదాయం పెంచండి.. అక్రమ ప్రకటనలపై ఉక్కుపాదం

నగరంలో హోర్డింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎందుకు ఆదాయం తక్కువగా ఉందని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ‘స్మార్ట్ పోల్స్’ ఏర్పాటు చేయాలని, వాటిపై సీసీ కెమెరాలు, వైర్లు, ప్రకటనల బోర్డులు క్రమపద్ధతిలో ఉండేలా చూడాలని సూచించారు.

పార్కింగ్ కష్టాలకు చెక్.. మేయర్లకు శిక్షణ

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై సీఎం దృష్టి సారించారు. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరియు ప్రైవేటు భూముల్లో పార్కింగ్ సదుపాయాల కల్పనకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లకు పాలనపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

నగర అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *