‘మరో ఘటన కోసం ఎదురుచూస్తున్నారా?’ పాఠశాలల భద్రతపై మహారాష్ట్ర సర్కారును నిలదీసిన బాంబే హైకోర్టు

బద్లాపూర్‌లోని పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో, విద్యార్థుల భద్రతను నిర్ధారించడంలో విఫలమైనందుకు బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. “మీరు మరో ఘటన కోసం ఎదురు చూస్తున్నారా? మీ సొంత ప్రభుత్వ పాఠశాలల్లోనూ మీరు తగిన చర్యలు తీసుకోలేదు” అని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల్లో అనేక లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సుమారు 46,000 ప్రభుత్వ మరియు 11,000కి పైగా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంకా సీసీటీవీ కెమెరాలు లేవని కోర్టు ఎత్తి చూపింది. అంతేకాకుండా, 25,000 ప్రభుత్వ, 15,000 ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ పూర్తి కాలేదు. తప్పుడు సమాచారం ఇస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని కోర్టు రాష్ట్ర అధికారులను హెచ్చరించింది.