ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు రాడార్ కేంద్రాలే లక్ష్యంగా భీకర వైమానిక దాడులు!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు రాడార్ కేంద్రాలే లక్ష్యంగా భీకర వైమానిక దాడులు!

వాషింగ్టన్/టెహ్రాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా మరోసారి ఇరాన్‌పై భీకర దాడులకు దిగింది. తాజాగా ఇరాన్‌కు చెందిన కీలక రాడార్ సైట్లపై అమెరికా దళాలు వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) చేపట్టాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలుత హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అమెరికా లక్ష్యంగా ఇరాన్ నాలుగు డ్రోన్లను లాంచ్ చేసి దాడికి యత్నించిందని, ఇందుకు ప్రతీకారంగానే తాము ఈ కౌంటర్ అటాక్ చేశామని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. తమ వైపు దూసుకొచ్చిన ఆ నాలుగు డ్రోన్లనూ గాల్లోనే విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే గల్ఫ్ తీర ప్రాంతంలో ఇరాన్ కదలికలను పర్యవేక్షించే గోరుక్, అలాగే క్వెష్మ్ ఐలాండ్‌ (Qeshm Island) లోని రాడార్ సైట్లపై గురిచూసి వైమానిక దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. తీర ప్రాంత భద్రతకు ఈ రాడార్ కేంద్రాలు ఇరాన్‌కు ఎంతో కీలకం. వీటిపై దాడి చేయడం ద్వారా ఇరాన్ నిఘా వ్యవస్థకు అమెరికా గట్టి దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది.

ఈ తాజా దాడులతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *