నెతన్యాహు బతికే ఉంటే వెతికి మరీ అంతం చేస్తాం ఇరాన్ సైన్యం సంచలన హెచ్చరిక

ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. గత రెండు వారాలుగా సాగుతున్న ఈ పోరులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడపై అంతర్జాతీయంగా సంచలనం రేగుతోంది. ఆయన గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జారీ చేసిన హెచ్చరిక ప్రకంపనలు సృష్టిస్తోంది. “పిల్లలను చంపిన ఈ నేరస్థుడు ఒకవేళ బతికే ఉంటే, మా పూర్తి శక్తిని ఉపయోగించి అతడిని వెతికి మరీ చంపుతాం” అని ఇరాన్ సైన్యం ఘాటుగా స్పష్టం చేసింది.
నెతన్యాహు పరిస్థితిపై అనుమానాలు పెరగడానికి మార్చి 13న ఆయన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోనే ప్రధాన కారణం. ఇరాన్‌పై దాడుల గురించి వివరించిన ఆ వీడియోలో నెతన్యాహు చేయి కదిపినప్పుడు ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. దీంతో ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిందా అనే అనుమానం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా #WhereIsBibi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో ఆయన మరణించారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది. AI వీడియోల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఇరాన్ ఇచ్చిన బహిరంగ హెచ్చరికతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నెతన్యాహు నిజంగా ఎక్కడున్నారు అనే అంశం ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.