తెలంగాణ సాహితీ శిఖరం నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రముఖ తెలుగు కవి, రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2025 సంవత్సరానికి గాను 24 భారతీయ భాషల్లో ప్రకటించిన వార్షిక అవార్డులలో తెలుగు విభాగంలో ఆయన రచించిన ‘అనిమేష’ కవితా సంపుటి ఈ గౌరవానికి ఎంపికైంది. కరోనా కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రకటన వెలువడటంతో తెలుగు కవులు, రచయితలు మరియు తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
మెదక్ జిల్లా బండారం గ్రామంలో 1955 జూన్ 12న జన్మించిన నందిని సిధారెడ్డి విద్యాభ్యాసం సిద్దిపేటలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ, ఎం.ఫిల్ మరియు పిహెచ్‌డి పట్టాలను పొందిన ఆయన, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా సేవలందించి 2012లో పదవీ విరమణ చేశారు. విద్యార్థి దశ నుంచే రచనలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, ‘మంజీర రచయితల సంఘం’ స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 2001లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కేవలం కవిగానే కాకుండా ప్రజా కవిగా, ఉద్యమకారుడిగా నందిని సిధారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1997లో ఆయన రాసిన “నాగేటి చాలల్లో నా తెలంగాణ” కవిత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనలా ఎగిసిపడింది. ‘పోరు తెలంగాణ’, ‘జై బోలో తెలంగాణ’ వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు జన బాహుళ్యంలోకి బలంగా వెళ్లాయి. 2017లో తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన ఆయన, ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో తెలుగు సాహితీ కీర్తిని మరోసారి చాటిచెప్పారు.