ఒకే రోడ్డుకు రెండుసార్లు శంకుస్థాపన అయినా తీరని ప్రజల కష్టాలు

హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ నుండి గుడిబండల్ వరకు, అలాగే టైలర్స్ స్ట్రీట్ నుండి సుధా నగర్ వరకు ఉన్న రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గత 15 ఏళ్లుగా రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండటంతో స్థానికుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఈ సమస్యపై జిడబ్ల్యూఎంసి 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మీ కుమారి జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోడ్డు పనులకు రెండోసారి శంకుస్థాపన చేశారు. అయితే రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన ‘షణ్ముఖ ప్రాజెక్ట్స్’ సంస్థ పనులు చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. తమతో ఇంకా ఒప్పందం కుదరలేదని, అందుకే పనులు ప్రారంభించలేమని సదరు కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఈ రహదారి పనులను పూర్తి చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించాలని కార్పొరేటర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.