మిత్రుడే మృత్యువై వచ్చి ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ ప్రాణం తీశాడు

మిత్రుడే మృత్యువై వచ్చి ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ ప్రాణం తీశాడు

ఒక చిన్న ఫోన్ కాల్ వివాదం చివరకు నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ హత్య కేసును పోలీసులు కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణానికి సంబంధించి ప్రధాన నిందితుడు సంతోష్‌తో పాటు అతనికి సహకరించిన తరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఉప్పల్ డిసిపి సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. సిటీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న సుధీర్, నిందితుడు సంతోష్ గత కొన్నేళ్లుగా స్నేహితులు కావడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం, మూడు రోజుల క్రితం ఒక ఫంక్షన్‌కు ఆహ్వానించే క్రమంలో ఫోన్ ఎత్తలేదన్న కారణంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ, సవాల్ విసురుకుని ఆదర్శనగర్ మైదానం వద్దకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వీరి మధ్య ఘర్షణ తలెత్తడంతో, సంతోష్ తన వద్ద ఉన్న చిన్న కత్తితో సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పారిపోవడానికి ప్రయత్నించిన సుధీర్ మార్గమధ్యలోనే మరణించాడు.

హత్య అనంతరం నిందితులు నాగారం వైపు పారిపోతుండగా ప్రత్యేక పోలీసు బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుండి రక్తపు మరకలున్న బట్టలు, బైక్ మరియు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ గతంలోనూ నేరచరిత్ర కలిగి ఉన్నాడని, తనను తాను ‘స్ట్రీట్ ఫైటర్’గా చెప్పుకునేవాడని పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను డిసిపి అభినందించి రివార్డులను ప్రకటించారు. ప్రస్తుతం నిందితులు రిమాండ్‌లో ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *