అమరజీవి త్యాగానికి చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

అమరజీవి త్యాగానికి చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శి పొట్టి శ్రీరాములు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలుగు జాతి అస్తిత్వం కోసం శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఆయన 58 రోజుల పాటు చేసిన నిరాహార దీక్షకు గుర్తుగా, ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించినట్లు వెల్లడించారు.

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని చిరస్మరణీయం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల జీవన్ మిషన్’కు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేసినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నీటిని తాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములును గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7 భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘అమరజీవి జలధార’ పేరుతోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడికి ఇది నిజమైన నివాళి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *