ఖమేనీ సొంత విమానం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ మెరుపు దాడి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వాయుసేన మరోసారి విరుచుకుపడింది. నిన్న రాత్రి జరిగిన ఈ మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి చెందిన వ్యక్తిగత విమానాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) అధికారికంగా ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామం ఇరాన్ అత్యున్నత నాయకత్వానికి భారీ షాక్‌గా మారింది.
ఈ విమానాన్ని ఖమేనీతో పాటు ఇరాన్ ఉన్నతాధికారులు వివిధ దేశాలతో సైనిక సంబంధాల కోసం మరియు ‘యాక్సిస్’ గ్రూపుల సమన్వయం కోసం ఉపయోగించేవారు. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ప్రాక్సీ గ్రూపులతో వ్యూహాత్మక సంప్రదింపులు జరపడానికి ఇది ఒక కీలక ఆస్తిగా ఉండేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీని విధ్వంసం ఇరాన్ సైనిక సమన్వయ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఐడీఎఫ్ పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఇరాన్ తన ప్రధాన విమానాలను పాతబడిన, పనికిరాని విమానాలు ఉంచే స్టోరేజ్ ఏరియాల్లో దాచి ఉంచింది. అయినప్పటికీ, ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం వాటిని గుర్తించి నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ రక్షణ వ్యూహాలను ఇజ్రాయెల్ చిత్తు చేసినట్లయింది.