హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ కల్తీ పెరుగు దందా

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో కల్తీ పెరుగు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు కలిసి రట్టు చేశారు. గురువారం నిర్వహించిన దాడుల్లో సుమారు 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు సీజ్ చేశారు. నగరంలో నిత్యావసర వస్తువుల కొరతను ఆసరాగా చేసుకుని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
అంబర్‌పేట రహత్ నగర్‌కు చెందిన నరేష్ రాఘవేంద్ర అనే వ్యక్తి గత ఆరు నెలలుగా ‘ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే, దీని ముసుగులో అతను పెద్ద ఎత్తున కల్తీ పెరుగును తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం కలిసి ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పై మెరుపు దాడి చేసి, నిల్వ ఉంచిన కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పెరుగు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఇలాంటి కల్తీ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.