సాక్షాత్తు యముడితోనే పోరాడింది.. భర్త ప్రాణాల కోసం ఎలుగుబంటిని గొడ్డలితో వేటాడిన వీరనారి

సాక్షాత్తు యముడితోనే పోరాడింది.. భర్త ప్రాణాల కోసం ఎలుగుబంటిని గొడ్డలితో వేటాడిన వీరనారి

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన వెలుగుచూసింది. అడవికి వెళ్లిన దంపతులపై ఒక్కసారిగా ఎలుగుబంట్ల గుంపు విరుచుకుపడగా, తన భర్తను కాపాడుకునేందుకు ఓ భార్య సాహసనారిగా మారింది. మృత్యువు నోట చిక్కుకున్న భర్తను రక్షించేందుకు ఆమె చేసిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

అడవిలో ఆకస్మిక దాడి

మిలూ గ్రామానికి చెందిన మాల్డే సోరెన్, తన భార్య లిలి సోరెన్‌తో కలిసి ఫిబ్రవరి 17న సమీపంలోని అడవికి వెళ్లారు. విస్తరాకులు సేకరించడమే వారి ఉద్దేశ్యం. పనిలో నిమగ్నమై ఉండగా ఊహించని విధంగా ఆరు ఎలుగుబంట్ల గుంపు వారిని చుట్టుముట్టింది. అందులో ఒక భారీ ఎలుగుబంటి నేరుగా మాల్డేపై దాడి చేసి, అతడిని కిందకు పడదోసింది. ఎలుగుబంటి పంజా దెబ్బలకు మాల్డే తీవ్రంగా గాయపడి విలవిల్లాడాడు.

ప్రాణాలకు తెగించి పోరాటం

సాధారణంగా క్రూర మృగాలను చూస్తే ఎవరైనా ప్రాణభయంతో పరుగులు తీస్తారు. కానీ లిలి సోరెన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన కళ్లముందే భర్త ప్రాణాలు పోతుంటే ఆమె మౌనంగా ఉండలేకపోయింది. భయం కంటే భర్త ప్రాణమే మిన్న అని భావించిన ఆమె, తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆయుధంగా మలుచుకుంది. ఏమాత్రం బెదరకుండా ఆ అడవి మృగంతో తలపడింది. లిలి గొడ్డలితో బలంగా దాడి చేయడంతో గాయపడిన ఆ ఎలుగుబంటి తోక ముడిచి అడవిలోకి పారిపోయింది. మిగిలిన ఎలుగుబంట్లు కూడా ఆ వీరనారి ధాటికి వెనుదిరిగాయి.

ఆసుపత్రిలో చికిత్స

ఎలుగుబంటి దాడిలో మాల్డే సోరెన్ తీవ్రంగా గాయపడటంతో, లిలి వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కియోంఝర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ అద్భుత సాహస గాథను స్థానిక అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. అడవి మృగంతో పోరాడి భర్తను కాపాడుకున్న లిలి సోరెన్ సాహసంపై సర్వత్రా ప్రశంసలు వ్యూక్తమవుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *