అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్.. ట్రంప్ వ్యూహాలకు చెక్ పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు
February 18, 2026

అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడం అమెరికా వల్ల కాదని, భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఎంతటి శక్తివంతమైన సైన్యం ఉన్న దేశానికైనా గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదని హెచ్చరించారు.
డొనాల్డ్ ట్రంప్ యుద్ధ నౌకల మోహరింపు, ఇరాన్‌లో పాలన మార్పుపై చేస్తున్న వ్యాఖ్యలను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. అమెరికా తన సైనిక శక్తిపై గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వారిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని స్పష్టం చేశారు. ఒకవైపు జెనీవాలో పరోక్ష అణు చర్చలు జరుగుతుండగానే, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ భారీ సైనిక విన్యాసాలు చేపట్టడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.