ఆటిజం ఉన్న పిల్లలను వదిలించుకోవాలని చూస్తున్నారా జాగ్రత్త.. ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు

వరంగల్‌కు చెందిన సుమతి అనే మహిళ తన ఇద్దరు ఆటిజం పిల్లలతో పడుతున్న కష్టాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, ఇద్దరు పిల్లలు ఆటిజంతో పుట్టారన్న కారణంతో భర్త వారిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, బాధ్యతను వదిలించుకోవాలని చూస్తున్నాడు. అయితే మన దేశ చట్టాల ప్రకారం ఇలాంటి చర్యలు నేరమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడతాయని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 93 ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వదిలేసినా లేదా నిర్లక్ష్యం చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 75 ప్రకారం పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించినా మూడేళ్ల జైలుతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఆటిజం ఉన్న పిల్లల కోసం మన దేశంలో అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ, వారి హక్కుల కోసం ‘దివ్యాంగుల హక్కుల చట్టం 2016’ మరియు ‘నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999’ వంటి బలమైన చట్టాలు అండగా ఉన్నాయని బాధితురాలు సుమతికి నిపుణులు భరోసా ఇస్తున్నారు.