శివుడి ప్రసాదంగా గంజాయి.. రీల్స్ పిచ్చితో కటకటాల పాలైన యువకులు

శివుడి ప్రసాదంగా గంజాయి.. రీల్స్ పిచ్చితో కటకటాల పాలైన యువకులు

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు నేటి యువత. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన దైవ భక్తిని చాటుకోవాల్సింది పోయి, ఏకంగా అసాంఘిక పనులకు పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు యువకులు. హైదరాబాద్ శివార్లలోని ఓ శివాలయంలో శివుడికి ‘స్పెషల్ ప్రసాదం’ పెడుతున్నామంటూ గంజాయిని ప్రదర్శిస్తూ రీల్స్ చేసిన ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?

జంగమ్మెట్ రవీందర్ నాయక్ నగర్ కాలనీకి చెందిన సభావత్ శ్రీచరణ్, వడ్త్యా విజయ్ కృష్ణ జిమ్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ నెల 15న శంషాబాద్ శివార్లలోని ఒక శివాలయానికి వెళ్లారు. అక్కడ అందరూ కొబ్బరికాయలు కొడుతుంటే, తాము మాత్రం విభిన్నంగా ‘గంజాయి’ని ప్రసాదంగా పెడుతున్నామంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

ఈ దారుణమైన ఘటనపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. “వ్యూస్ కోసం విలువలనే వదిలేస్తారా?” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తికి నిదర్శనమైన శివరాత్రి రోజున ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు.

“క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టుకోకండి. ఒక్కసారి ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదైతే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది” అని యువతను హెచ్చరించారు.

పోలీసుల చర్యలు

వైరల్ వీడియో ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా వాడుకోవాలి కానీ, ఇలాంటి వ్యసనాలకు మరియు అపచారాలకు కాదని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *