హీరో విశాల్‌కు బిగ్ షాక్.. కోర్టులో చుక్కెదురు కావడంతో తప్పని తిప్పలు

తమిళ నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్‌తో నడుస్తున్న ఆర్థిక వివాదంలో భాగంగా రూ. 10 కోట్లు తక్షణమే డిపాజిట్ చేయాలంటూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అదనంగా ఆరు వారాల గడువు కావాలంటూ విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నిర్ద్వంద్వంగా కొట్టివేసింది.
అసలు వివాదం ఏమిటి?
గతంలో లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ రూ. 21.29 కోట్లు చెల్లించాలని, దానికి 30 శాతం వడ్డీ కూడా వర్తిస్తుందని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై విశాల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, రూ. 10 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలనే షరతుతో స్టే మంజూరైంది. అయితే, తన బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారని, అందుకే నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించలేకపోయానని విశాల్ తరపు న్యాయవాది మంగళవారం కోర్టుకు విన్నవించారు.
కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
విశాల్ విన్నపాన్ని జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ కె. కుమరేష్ బాబులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఉత్తర్వులు ఇచ్చి ఇప్పటికే ఎనిమిది వారాలు గడిచిపోయాయని, ఇప్పుడు మళ్ళీ గడువు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ కొట్టివేయడంతో, సింగిల్ జడ్జి తీర్పు ప్రకారం అప్పు రికవరీ కోసం లైకా ప్రొడక్షన్స్ ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.