రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో వణుకు పుట్టించే నిజాలు.. యువతను షూటర్లుగా మారుస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసంపై జరిగిన కాల్పుల కలకలం ఇంకా తగ్గకముందే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఫిబ్రవరి 1న జుహులోని ఆయన ఇంటిపై జరిగిన ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు శుభమ్ లోంకర్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ విచారణలో వెలుగు చూసిన కొన్ని విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అమాయక యువతను నేర ప్రపంచంలోకి లాగేందుకు బిష్ణోయ్ ముఠా ఒక ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ‘హిందుత్వ’ భావజాలాన్ని అడ్డం పెట్టుకుని, యువతను బ్రెయిన్ వాష్ చేస్తూ వారిని షూటర్లుగా మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయుధాలతో కూడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, గ్యాంగ్‌స్టర్ల సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యేలా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఆగ్రాకు చెందిన ప్రధాన షూటర్ దీపక్ శర్మతో సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన మకోకా (MCOCA) చట్టం కింద కేసులు నమోదు చేశారు. “ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, తదుపరి బుల్లెట్లు నేరుగా బెడ్ రూమ్‌లోకి వస్తాయి” అంటూ సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ ప్రముఖులను ఈ గ్యాంగ్ హెచ్చరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న మాస్టర్ మైండ్ శుభమ్ లోంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.