మదనపల్లి చిన్నారి ఘటనపై నిప్పులు చెరిగిన జగన్.. కూటమి సర్కార్కు సూటి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆడబిడ్డలకు రక్షణ కరువైందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన యావత్ సమాజానికే మచ్చ అని ఆయన అభివర్ణించారు.
పోలీస్ వ్యవస్థ విఫలమైంది బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో చట్టం, వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని అనడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. అమాయక బాలికలను కాపాడలేని ప్రభుత్వం, సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తుందని ఆయన నిలదీశారు. గతంలో ముచ్చుమర్రి, కంబాలదిన్నె, వడమాలపేటలో జరిగిన దారుణాలను గుర్తు చేస్తూ.. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని విమర్శించారు.
రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఈ అనర్థాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని జగన్ ధ్వజమెత్తారు. హోంమంత్రికి శాంతిభద్రతలపై పట్టు లేదని, లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతూ వ్యవస్థలను నీరుగారుస్తున్నారని విమర్శించారు. “ప్రభుత్వంలోని వారికి కేవలం సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే పనిగా మారింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది?” అని జగన్ ప్రశ్నించారు.
ప్రతిపక్షాలపై కక్షసాధింపు తప్ప రక్షణ లేదు మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి వారి ఇళ్లపై దాడులు చేయించడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి చూపిస్తున్న శ్రద్ధ.. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో చూపడం లేదని జగన్ ఆక్షేపించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కేవలం హడావిడి ప్రకటనలు చేసి ఆ తర్వాత వదిలేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.