నేడు దానం నాగేందర్ భవితవ్యం తేలనుందా.. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై స్పీకర్ కీలక విచారణ

నేడు దానం నాగేందర్ భవితవ్యం తేలనుందా.. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై స్పీకర్ కీలక విచారణ

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆ పార్టీలోకి ఫిరాయించారు.

అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానం నాగేందర్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెండేళ్ల క్రితమే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ ఫిరాయింపు ఆరోపణలపై వరుస విచారణలు జరుపుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు రాగా, అందులో 8 మందికి సంబంధించిన విచారణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి ఫిరాయింపు అంశంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విచారణకు హాజరు కావాలని ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో నేటి విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *