టీ20 వరల్డ్ కప్ నెదర్లాండ్స్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. ఆ స్టార్ ఆటగాడిపై వేటు తప్పదా

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా, బుధవారం అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్ధమవుతోంది.
కుల్దీప్ యాదవ్‌పై వేటు?
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ, ఫీల్డింగ్‌లో అలసత్వం ప్రదర్శించిన కుల్దీప్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అసహనానికి గురైన నేపథ్యంలో, అహ్మదాబాద్ పిచ్ పరిస్థితులను బట్టి కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బుమ్రాకు విశ్రాంతి.. సిరాజ్ ఎంట్రీ!
వరుస మ్యాచ్‌లు ఆడుతున్న ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతినిచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. అదే జరిగితే మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వస్తాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ కొనసాగనుండగా, వాషింగ్టన్ సుందర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
ఫామ్ కోసమే అభిషేక్ శర్మ ఆరాటం
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. సూపర్-8కు ముందు అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు కీలకం. ఒకవేళ అభిషేక్ బరిలోకి దిగితే సంజూ శాంసన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు.
భారత అంచనా తుది జట్టు
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తీ.