మోదీపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం

ప్రధాని నరేంద్ర మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ, తాను మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు ఇప్పటికే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తరుణంలో, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. సదరు వీడియో నిజా నిజాలను పరిశీలిస్తున్నామని, అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వీడియోలో ట్రంప్ మోదీని స్నేహితుడిగా అభివర్ణించినప్పటికీ, ఆయన వాడిన కొన్ని పదాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.