అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరిట బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం తాకట్టు, కొత్త ఈస్ట్ ఇండియా కంపెనీగా మారుతోందా?

అమెరికాతో కుదుర్చుకున్న వివాదాస్పద వాణిజ్య ఒప్పందం వల్ల బంగ్లాదేశ్ తన ఆర్థిక స్వేచ్ఛను కోల్పోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు సున్నా శాతం పన్ను మినహాయింపు లభించినప్పటికీ, అమెరికా నుండి దిగుమతి చేసుకున్న పత్తి మరియు నూలును మాత్రమే వాడాలనే నిబంధన ఆ దేశాన్ని అమెరికాపై ఆధారపడేలా చేస్తోంది. అలాగే అమెరికన్ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించే అధికారాన్ని బంగ్లాదేశ్ కోల్పోవడం మరియు అమెరికా ఇచ్చే ‘హలాల్’ సర్టిఫికేట్‌ను ప్రశ్నించకుండా ఆమోదించాల్సి రావడం దేశ సార్వభౌమాధికారానికి సవాలుగా మారింది.
మరోవైపు, ఈ ఒప్పందం వల్ల బంగ్లాదేశ్‌పై భారీ ఆర్థిక భారం పడనుంది. మార్కెట్ ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ధరకు అమెరికా నుండి గోధుమలు, గ్యాస్ కొనుగోలు చేయడంతో పాటు, వేల కోట్ల రూపాయలతో 25 బోయింగ్ విమానాలను కొనడానికి ప్రభుత్వం అంగీకరించింది. బంగ్లాదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలు లేకుండా అమెరికాతో పంచుకోవడం ప్రైవసీపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. భారత్ ప్రభావాన్ని తగ్గించే నెపంతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయిందని, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక ‘పప్పెట్ స్టేట్’గా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.