రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని బీజేపీ డిమాండ్

అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంటులో కీలక ప్రతిపాదన చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఆయన ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభలో బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని, ఇది పూర్తిగా ‘లొంగిపోవడమే’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిశికాంత్ దూబే మాట్లాడుతూ రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టుబడుతుండటంతో సభలో ఉత్కంఠ నెలకొంది.